కరోనా ప్రభావం అన్ని రంగాలతో పాటు వినోద పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అన్ని పనులు ఎక్కడివక్కడే ఆగిపోవటంతో వందల సినిమాలు నిలిచిపోయాయి. వీటిలో ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలు కొన్ని ఉండగా, మరికొన్ని షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమల దశలో ఉన్నాయి. మరి కొన్ని సినిమాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. అయితే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు అంటే రిలీజ్‌ కు ఎదురు చూస్తున్న సినిమాలతో ఇప్పట్లో మోక్షం లేనట్టే. మరి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సినిమాల పరిస్థితేంటి..?

ఈ విషయం మీదే ఈ రోజు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పలువురు నిర్మాతలు, సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిశ్రమపై కరోనా ప్రభావం, తిరిగి పనులు ప్రారంభించేందుకు సరైన సమయం, ప్రారంభించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి అంశాల మీద  చర్చించారు. పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకొకపోయినా జూన్‌ నుంచి సినిమాల షూటింగ్ లు తిరిగి ప్రారంభించే పరిస్థితి ఉండ వచ్చని చెప్పారు మంత్రి తలసాని.

కరోనా కారణంగానష్టపోయిన సినీ రంగానికి ప్రభుత్వ పరంగా చేయాల్సి సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే షూటింగ్ లు తిరిగి ప్రారంభించే నిర్ణయం అంత త్వరగా తీసుకునేది కాదని. దీని గురించి విస్తృత స్థాయి చర్చ తరువాత ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతోను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమ అభివృద్దికి కొత్త పాలసీలు తీసుకువస్తామని వెల్లడించారు.