బాలీవుడ్ సినీ రంగాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. బుధవారం విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి చెందగా గురువారం లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ మృతి చెందాడు. శుక్రవారం కూడా ఆ విషాదం కొనసాగింది.  నిర్మాత, సినిమా, టెలివిజన్ ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్‌ మక్కర్‌ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. కుల్మీత్‌ గుండెపోటుతో మరణించినట్టుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

లాక్‌ డౌన్‌కు ముందే అస్వస్థతకు గురైన ఆయన అప్పటి నుంచి ధర్మశాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నటి విద్యాబాలన్‌, దర్శక నిర్మాత కరన్‌ జోహార్‌, హన్సల్‌ మెహతా, సుభాష్ ఘయ్‌ లాంటి వారు కుల్మీత్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. 

'ఇది నిజంగా షాకింగ్‌.. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు మా ఘన నివాళులు. నా తరపున మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తున్నా' అంటూ ట్వీట్‌ చేసింది విద్యా బాలన్‌. దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ `ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ ఆఫ్‌ సీఈవోగా మీరు నిస్వార్థంగా పని చేశారు. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం తీవ్ర వేదన కలిగిస్తోంది. మీ ఆత్మకు శాంతి కలగాలి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్‌ చేశాడు.