బన్నీ, సుకుమార్ క్రేజీ కాంబోలో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధం అయింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 చిత్రాలు వచ్చాయి. రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్ బన్నీకి ఓ కథ చెప్పి మెప్పించాడు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది. 

రేపు(అక్టోబర్ 30 బుధవారం) ఉదయం 9:30 కి అల్లు అర్జున్ 20వ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించే హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారు. 

బన్నీ సరసన రష్మిక మందన రొమాన్స్ చేయబోతున్నట్లు మైత్రి సంస్థ  ప్రకటించింది. వరుస క్రేజీ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక బన్నీ మూవీ మరో బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఛలో, గీత గోవిందం చిత్రాలతో టాలీవుడ్ లో రష్మిక తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

అల్లు అర్జున్ సుకుమార్ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పనిచేసే సంగీత దర్శకుడు, ఇతర సాంకేతిక వర్గం, నటీనటుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. 

అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న అల వైకుంఠపురములో మూవీ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఇక బన్నీ, సుకుమార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.