లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ బుధవారం ఉదయం సుధీర్ఘ అనారోగ్యం తరువాత తుది శ్వాస విడిచారు.  దాదాపు రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇర్ఫాన్ చివరకు ఆ పోరాటంలో ఓడిపోయాడు. ఆయన మృతి బాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రమే కాదు యావత్ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు ఇర్ఫాన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంటే.. అభిమానులు ఆయన్ను మిస్ అవుతున్నాం అంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇర్ఫాన్ కీలక పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం `లైప్‌ ఆఫ్‌ పై`లో లైఫ్‌ గురించి ఇర్ఫాన్ చెప్పిన ఓ డైలాగ్‌ను ట్వీట్‌ చేస్తూ ఆయనకు నివాళులు ఆర్పించాడు ఓ అభిమాని.

`మరణం మన జీవితాన్ని ముగిస్తుందని నేను అనుకుంటాను. అయితే అత్యంత బాధకరమైన విషయం ఏంటంటే చివరి సమయంలో మరణం ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వదు` అంటూ ఇర్ఫాన్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోతో పాటు ఇర్ఫాన్ ఇతర సినిమాలో పోషించిన విలక్షణ పాత్రలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ అంగ్‌ లీ తెరకెక్కించిన `లైఫ్‌ ఆఫ్‌ పై` లో ఇర్ఫాన్‌తో పాటు హీరోయిన్‌ టబు, సూరజ్‌ శర్మ నటించారు.