స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇవ్వడం చాలా మందికి అదృష్టం. కానీ అలా స్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయం కావటం మరికొంత మంది తలకు మించిన భారం అవుతుంది. అలాంటి భారం తోనే సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన నటుడు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌. మెగాస్టార్‌ చిరంజీవి వారసుడిగా భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేశాడు చరణ్. ఒక్కో సినిమాకు తనను తాను నటుడిగా మరింత ఉన్నంతగా మలుచుకుంటూ వస్తున్న చరణ్‌, నటుడిగానే కాదు నిర్మాతగానూ ఆకట్టుకుంటున్నాడు.

అందరు కొడుకులు తండ్రి డబ్బులతో హీరోలుగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంటే, చరణ్ మాత్రం తానే నిర్మాతగా మారి తండ్రి చిరంజీవి రీఎంట్రీ సినిమాను నిర్మించాడు. అంతేకాదు తండ్రి కలల ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డిని నిర్మించి తన తండ్రి కోరిక తీర్చాడు. ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ ఈ రోజు (27-03-2020) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.

అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించ వద్దని అభిమానులకు పిలుపునిచ్చిన చెర్రీ, ఇంట్లో పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అయితే మెగా పవర్‌ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోతుంది. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.