సినీ తారలపై ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన అభిమానం. వారి మీద ప్రేమతో ఎంతపనైనా చేయడానికి సిద్దపడుతుంటారు. తాజాగా నటి పూజాహెగ్డేపై ప్రేమతో ఓ యువకుడు చేసిన పని వార్తల్లోకెక్కింది. ఆమెని కలవడం కోసం ఐదు రోజులపాటు ముంబై రోడ్లపై ఉన్నాడు. 

ఎండ, చలి దేనినీ లెక్క చేయకుండా ఫుట్ పాత్ పై పడుతూ ఆమెకోసం ఎదురుచూశాడు. ఈ విషయాన్ని పూజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అతడితో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు తన అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

'నన్ను కలవడానికి ముంబైకి వచ్చి ఐదు రోజుల పాటు వెయిట్‌ చేసినందుకు భాస్కర్‌ రావుకు థ్యాంక్యూ. ఈ విషయం నన్ను కదిలించింది.. కానీ నా అభిమానులు ఇలా ఇబ్బంది పడటం బాధ కలిగిస్తోంది. నా కోసం అభిమానులు ఇలా చేయడాన్ని నేనెప్పుడు కోరుకోను. మీరు ఎక్కడున్నా.. మీ ప్రేమను, అభిమానాన్ని  నేను పొందుతూనే ఉంటాను. మీరే నాకు బలం. లవ్‌ యూ ఆల్‌.. ' అని రాసుకొచ్చింది.

ఇటీవల ఈ బ్యూటీ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.