Asianet News TeluguAsianet News Telugu

నా నేత జగన్ కు చిక్కులు వద్దని ఫిర్యాదు: నకిలీ ఖాతాపై అలీ

ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు అలీ పేరు మీద 2017 నుంచి నకిలీ ట్విట్టర్ ఖాతా నడుస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దానిపై అలీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Fake twitter account on the name of comedian Ali
Author
hyderabad, First Published Jul 18, 2020, 6:40 PM IST

హైదరాబాద్: తెలుగు సినీ హాస్య నటుడు అలీకి నకిలీ ట్విట్టర్ ఖాతా షాక్ తగిలింది. తన పేరు మీద నకిలీ ట్విట్టర్ ఖాతా నడుస్తోందని తెలిసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. తన పేర నడుస్తున్న నకిలీ ట్విట్టర్ ఖాతాపై అలీ సైబరాబాద్ క్రైమ్ విభాగం డిప్యూటీ కమిషనర్ ప్రయదర్శినికి శనివారంనాడు ఫిర్యాదు చేశారు. 

గుర్తు తెలియని వ్యక్తి 2017 నుంచి అలీ పేరిట ట్విట్టర్ ఖాతాను నడుపుతున్నట్లు తేలింది. వాటిలో వీడియోలు, మెసేజ్ లు పెడుతూ వస్తున్నాడు. పలువురు నటీనటులకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతూ వస్తున్నాడు. 

దాదాపు పదకొండు వందల సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నానని, తాను సోషల్‌ మీడియా ట్వీట్టర్‌లో యాక్టర్‌ అలీ అఫీషియల్‌ పేరుతో ఎకౌంట్‌ ఓపెన్‌ చేసి పలువులు నటీనటుల్ని అభినందిస్తున్నట్లు పోస్ట్‌లు పెడుతున్నారని అలీ చెప్పారు. "నాకు ఎటువంటి ట్వీట్టర్‌ ఎకౌంట్‌ లేదు. అది ఫేక్‌ ఎకౌంట్‌. ఆ ఎకౌంట్‌లో వాళ్లు పెట్టిన పోస్ట్‌లను మీడియా వాళ్లు నేనే చేశాననుకొని దానిపై వార్తలను ప్రసారం చేస్తున్నారు" అని చెప్పారు.  

"ఈ వ్యవహారం అంతా మూడేళ్ల నుండి జరుగుతుందట. సోషల్‌ మీడియాలో నేనంత యాక్టివ్‌గా లేకపోవటంతో నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది. నాకు తెలిసిన వెంటనే శనివారం సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నా ప్రమేయం లేకుండా పెట్టే ఆ పోస్ట్‌లకు నాకు ఏ బాధ్యత ఉండదు. ఇకనుండి మీకు ఏ న్యూస్‌ అన్నా తెలిస్తే దానిగురించి ఏదైనా వార్త ప్రసారం చేయలనుకుంటే నన్నుగాని, నాటీమ్‌ మెంబర్స్‌ను కానీ సంప్రదించాలని మనవి చేస్తున్నాను" అని అలీ చెప్పారు. 

"ప్రస్తుతం నేను వైయస్సార్‌సిపి పార్టీలో కీలక సభ్యునిగా ఉన్నాను. నా వల్ల మా పార్టీకిగాని, మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి గాని భవిష్యతులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం నేను ఈ రోజు కంప్లైంట్‌ చేశాను" అని అలీ చెప్పారు. "ఫేక్‌ ఎకౌంట్‌లో వాళ్లు రాసిన న్యూస్‌ కన్నా అది నేనే పెట్టాననుకొని ఆ హీరోల ఫ్యాన్స్‌  చేసే  కామెంట్స్‌ చూస్తుంటే నాకు, నా కుటుంబానికి ఎంతో భాద కలుగుతుంది"  అని అలీ చెప్పారు. "దయచేసి ఇటువంటి పనులు ఇకపై చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్‌ కమీషనరేట్‌ ఆఫీసర్‌ డిసిపి రోహిణిని కోరాను" అని చెప్పారు..

ఆ ఖాతా తనది కాదని చెబుతూ తన పేరిట ఖాతాను నడిపిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అలీ కోరారు. సెలిబ్రిటీల పేరు మీద నకిలీ ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలు నడుపుతున్న సందర్భాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

అలీ తెలుగులో పేరుప్రతిష్టలు పొందిన నటుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు విశేషంగా అభిమానులు ఉన్నారు. ఆయన చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను తన నటన ద్వారా అలరిస్తూ వస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios