క్రిందటి వారం దిల్ రాజు  రిలీజ్ చేసిన చిత్రం  ‘ఎవ‌రికీ చెప్పొద్దు’. ఈ చిత్రం వచ్చిందో వెళ్లిందో కూడా ఎవరికీ తెలియలేదు. దిల్ రాజు వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేసినా ప్రమోషన్ సరిగ్గా లేదు.  వెబ్ మీడియాలో రివ్యూలు కూడా పెద్దగా రాలేదు. దాంతో ఈ సినిమాకు పూర్తిగా బజ్ లేకుండా పోయింది. అసలు  సినిమా హిట్టో , ప్లాఫో తర్వాత సంగతి అసలు రిలీజైంది...ఏమైంది అనే  విషయమైనా జనాలకు తెలిసేలా చెయ్యాల్సింది అని ట్రేడ్ లో అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హీరో, నిర్మాత అయిన రాకేష్ వర్రె మీడియాతో మాట్లాడారు. దిల్ రాజుగారు సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు తిట్టారని అన్నారు.

రాకేశ్‌ మాట్లాడుతూ– నటుడుగా‘‘బాహుబలి’ సినిమా చేశాక ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ’కి వెళ్లి, తిరిగొచ్చిన తర్వాత కథల కోసం ఎదురు చూశా.అప్పుడే దర్శకుడు బసవ శంకర్‌ పరిచయం అవడంతో ఈ సినిమా మొద లైంది.  ‘ఎవరికీ చెప్పొద్దు’ కథను మొదట ‘దిల్‌’ రాజుగారి దగ్గరకి తీసుకెళ్లాను. ఆయనకు వినడం కుదర్లేదు.

 ‘నువ్వు ఏమైనా చెయ్‌ కానీ ప్రొడ్యూస్‌ చేయొద్దు’ అని నాతో చెప్పారాయన. చాలా మంది నిర్మాతలను కలిశాం.. కుదర్లేదు. బహుశా కులం అనే సున్నితమైన టాపిక్‌ ఉందని ఎవరూ ముందుకురాలేదేమో? దాంతో నేనే నిర్మించాను. సినిమా అయ్యాక రాజుగారి దగ్గరకు తీసుకెళ్తే ప్రొడ్యూస్‌ చేసినందుకు తిట్టారు. ఆయనే మా సినిమాను రిలీజ్‌ చేశారు. ’’ అన్నారు.
 
 క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేశ్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేశ్ వ‌ర్రె నిర్మాణంలో ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసారు.  ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ శర్మ, కెమెరా: విజయ్‌ జె.ఆనంద్‌.