దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకు సిద్ధం అవుతోంది. 

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సతీష్ వేగేశ్న నుంచి వస్తున్న మరో విలేజ్ బ్యాక్ డ్రాప్ చిత్రంగా అనిపిస్తోంది. కాకపోతే ఈ సారి కాస్త యాక్షన్ అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రాజీవ్ కనకాల రఫ్ లుక్ ఆకట్టుకుంటోంది. 

కళ్యాణ్ రామ్, హీరోయిన్ మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా బావుంది. 'ఎదిరించే వాడు రానంతవరకేరా.. భయపెట్టేవాడి రాజ్యం' అంటూ కళ్యాణ్ రామ్ చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్స్ బాగా పేలుతున్నాయి.  

ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపి సుందర్ సంగీత దర్శకుడు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు. కాగా నేడు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు.