ఇషా రెబ్బా తాజాగా నటించిన చిత్రం 'రాగల 24గంటల్లో'. శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాగల 24 గంటల్లో చిత్రం తెరకెక్కుతోంది. నవంబర్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసింది. 

ట్రైలర్ ని ఆసక్తి రేపే విధంగా తీర్చిదిద్దారు. సత్యదేవ్, ఇషా రెబ్బా ఈ చిత్రంలో భార్య భర్తలుగా నటిస్తున్నారు. నటుడు శ్రీరామ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో ఇషా రెబ్బా అందంగా కనిపిస్తోంది. కానీ ఆమె భర్త మరణంతో ఇషా రెబ్బా జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. 

నటుడు శ్రీరామ్ ఇషా రెబ్బా  కేసుని ఇన్వెస్టిగేట్ చేసే అధికారిగా నటిస్తున్నాడు. ఆమె భర్తని ఎవరు చంపారు అనేది ట్రైలర్ లో ఉత్కంఠ రేపుతోంది. 'నా భర్తని నేనే చంపా' అంటూ ఇషా రెబ్బా చెప్పే డైలాగ్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. 

శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ బ్యానర్ పై కానూరు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నవంబర్ 15న రాగల 24గంటల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇషా రెబ్బా కెరీర్ ఆరంభం నుంచి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. రాగల 24గంటల్లో చిత్రం తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే ధీమాలో ఈ తెలుగు నటి ఉంది.