బెంగళూరు: కర్ణాటకలో డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. శాండిల్ వుడ్ లో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థితిలో సినీ నటి సంజన గల్రానీని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతకు ముందు సంజన సీసీబీ అధికారులతో వాగ్వివాదానికి దిగింది.

తెలుగులో తరుణ్ నటించిన సోగ్గాడు చిత్రం ద్వారా సంజన ఎంట్రీ ఇచ్చింది. బుజ్జిగాడు, యమహో యమ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో నటించింది. డ్రగ్స్ కేసులో సీసీబీ పోలీసులు ఇప్పటికే రాగిణి ద్వివేదిని అరెస్టు చేశారు. బెంగుళూరులోని ఇందిరా నగర్ నివాసంలో సంజనను అదుపులోకి తీసుకున్నారు.

అంతకు ముందు సంజన ఇంటిపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు. ఇప్పటికే ఆమె మేనేజర్ ను సిసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  విచారణకు హాజరు కావాలని సీసీబీ అధికారులు ఇప్పటికే నోటీలసులు జారీ చేశారు. 

డ్రగ్స్ కేసులో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు శివ ప్రకాష్ ను సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాగిణి ద్వివేదిని సీసీబీ అధికారులు విచారించారు. ఆమె వెల్లడించిన వివరాల ఆధారంగా 12 మందిపై సిసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

సంజనకు డ్రగ్స్ సప్లయిర్స్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సంజన మిత్రుడిని సీసీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. సంజనను సీసీబీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకుని వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

గత రెండు మూడు నెలలుగా సంజన, రాగిణి ద్వివేదిలను కలిసినవారిని కూడా సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించవచ్చునని అంటున్నారు. డ్రగ్స్ కేసు చుట్టుముట్టుడుతున్న క్రమంలో కొంత మంది బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీసీబీ అధికారులు గుర్తించారు.