హైదరాబాద్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే, డ్రగ్స్ కేసులో తన పేరు బయటపడగానే ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల తన నివాసం నుంచి మూడు రోజుల క్రితం ఆమె షూటింగ్ కోసం వెళ్లారు. 

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. డ్రగ్స్ కేసుపై ఈ స్థితిలో ఆమె మాట్లాడేందుకు సిద్ధంగా లేనట్లు తెలుగు టీవీ న్యూస్ చానెల్స్ ప్రసారం చేస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది.

ఇదిలావుంటే, తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు సమన్లు జారీ చేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు నటి సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ రోహిణి అయ్యర్, ఫిల్మ్ మేకర్ ముకేష్ ఛాబ్రాలకు ఎన్సీబీ సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రియా వెల్లడించిన పేర్లలో ఆ ఐదుగురి పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారు డ్రగ్స్ తీసుకున్నట్లు రియా చక్రవర్తి వెల్లడించారు. 

బాలీవుడ్ పార్టీల్లో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్సీబీ అధికారులు 15 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. 

ఎన్సీబీ అధికారులు శనివారంనాడు ముంబై, గోవాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి సంబంధించిన కేసులో వారు ఈ దాడులు నిర్వహించారు. రియా చక్రవర్తి గోవాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 

పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడి అవుతున్న నేపథ్యంలో ఎన్సీబీ ఉన్నత స్థాయి సమావేశం ముంబైలోని కార్యాలయంలో ఈ సాయంత్రం జరగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ఎన్సీబీ ఖరారు చేసుకుంటుంది.