`అల వైకుంఠపురములో` చిత్రంతో అల్లు అర్జున్‌ రేంజే మారిపోయింది. రెండేళ్ళు గ్యాప్‌ తీసుకున్నా చాలా గట్టిగా కొట్టాడు. అభిమానులు, చిత్రపరిశ్రమ, తన ప్రత్యర్థులు షాక్‌ అయ్యేలా బ్లాక్‌ బస్టర్‌ సాధించాడు. దీంతో హీరోగా ఆయన రేంజ్‌ మారిపోయింది. పాన్‌ ఇండియా స్థాయికి చేరిపోయాడు. రెమ్యూనరేషన్‌ని డబుల్‌ చేశాడు. ఈ ఊపులోనే ఆసక్తికర ప్రాజెక్టులు ప్రకటిస్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు.


ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఎర్ర చందన స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టాక్‌. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంది. వైరస్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతోపాటు వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో `ఐకాన్ (కనిపించుట లేదు)` అనే సినిమాని కూడా ప్రకటించారు. తన 21వ చిత్రంగా దీన్ని తెరకెక్కించనున్నట్టు పేర్కొన్నారు. 


అయితే తాజాగా బన్నీ.. వేణు శ్రీరామ్‌కి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. శుక్రవారం అందరిని ఆశ్చర్యపరిచేలా కొరటాలశివ దర్శకత్వంలో తన 21వ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రూపొందనున్న ఈ చిత్రానికి శాండీ, స్వాతి, నట్టీలు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ రూపొందనుందని టాక్. 2022 ప్రథమార్థంలో దీన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. 


బన్నీ కొత్త సినిమా ప్రకటనతో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందించాల్సిన `ఐకాన్‌` ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. బన్నీ తన సినిమా స్థానంలో మరో చిత్రాన్ని ప్రకటించడంతో వేణుకు దిమ్మతిరిగిపోయింది. మరి ఇంతకి ఆ సినిమా ఉంటుందా? మొత్తంగానే పక్కన పెట్టారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. చిత్ర పరిశ్రమలో ఏ క్షణంలో ఎలాంటి ట్విస్ట్ లైనా చోటు చేసుకోవచ్చు. ఇప్పుడు వేణు శ్రీరామ్‌ విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వేణు..పవన్‌ కళ్యాణ్‌ హీరోగా `వకీల్‌ సాబ్‌`ని రూపొందిస్తున్నారు.