మిగిలిన వారితో పోలిస్తే దర్శకుడి తేజ తీరు కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఆయన స్టైల్. తాజాగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల హీరోలపై తనదైన శైలిలో పంచ్ లు వేశాడు. మరీ ముఖ్యంగా కమల్ హాసన్ మహానటుడు అంటే తేజ అసలు ఒప్పుకోవడం లేదు. 

కమల్ హాసన్ మహానటుడు అంటే తను ఒప్పుకోనని.. అది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. 'దశావతారం' సినిమాలో ఆయన పది గెటప్స్ వేశాడు.. బాగా చేశాడని అంతా అనుకున్నారని కానీ ఆ పది గెటప్స్ లో కమల్ హాసనే కనిపించాడని అన్నారు. అదే 'రోబో' సినిమాలో రజినీకాంత్ ని చూస్తే.. సైంటిస్ట్ గా, రోబోగా భిన్నమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడని.. రోబోలో అసలు రజినీకాంత్ కనిపించడని.. పాత్రే కనిపిస్తుందని.. అది నటుడి గొప్పతనమని అన్నారు.

ఎంతో కష్టపడితే కానీ స్టార్స్ కాలేదని.. ఫ్లూక్ లో కొందరు స్టార్స్ అయినా ఎక్కువ రోజులు నిలబడలేరని కామెంట్ చేశారు. తన దృష్టిలో క్యారవాన్ లో ఉండేవాడు హీరోనే కాదని.. ఇతర నటుల యాక్టింగ్ ని కూడా గమనిస్తూ సెట్స్ లో ఉండేవాడే నిజమైన స్టార్ అవుతాడని.. అమితాబ్, చిరంజీవి, అమీర్ లాంటి నటులు అదే పని చేశారని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో చిరంజీవి గొప్పతనం గురించి కూడా మాట్లాడారు. ఆయన మెగాస్టార్ ఊరికే అవ్వలేదని.. ఎంతో ఫోకస్, డెడికేషన్ తో ఈ స్థాయిలో ఉన్నారని అన్నారు. ఇక తేజ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది 'సీత' అనే సినిమాను తెరకెక్కించాడు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు.