అవునన్నా కాదన్నా రాంగోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్. శివ, క్షణ క్షణం లాంటి చిత్రాలతో వర్మ ఇండియన్ సినిమాకే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశాడు. శివ చిత్రం ఇండియన్ సినిమాలో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా మిగిలిపోయింది. ఆ చిత్ర టేకింగ్ క్రెడిట్ మొత్తం వర్మకే దక్కుతుంది. అలాంటి అద్భుత చిత్రాలని తెరకెక్కించిన వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో అని ఆలోచిస్తే ఆశ్చర్యం కలగక మానదు. 

రాంగోపాల్ వర్మేనా ఈ చిత్రాలు తీస్తోంది అనే అనిపించక మానదు. ఇటీవల వర్మ తెరకెక్కించిన వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఆఫీసర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాలు మీడియాలో న్యూస్ అవుతున్నాయి కానీ థియేటర్స్ లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం లేదు. 

వర్మ వివాదభరితమైన కథలే ఎంచుకుంటున్నాడనే ముద్ర ఆల్రెడీ పడిపోయింది. అయినా కూడా ఆ చిత్రాలు తీవ్రంగా నిరాశపరుస్తుండడంతో రాంగోపాల్ వర్మ మార్కెట్ రోజు రోజుకి దిగజారుతోంది. శివ లాంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తెరకెక్కించిన వర్మ తాజాగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రానికి జరిగిన బిజినెస్ కేవలం 2 కోట్లు మాత్రమే. 

ఆఫీసర్ చిత్రానికి 9 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరగగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్త్ర థియేట్రికల్ రైట్స్ 6 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రానికి కేవలం 2 కోట్లు మాత్రమే ప్రీరిలీజ్ బిజినెస్ అంటే వర్మ మార్కెట్ ఏ స్థాయిలో దెబ్బ తినిందో అర్థం అవుతోంది. 

వర్మ చిత్రాలు మీడియాలో వివాదాల వల్ల తొలిరోజు థియేటర్స్ కు కొంతమంది ప్రేక్షకులు వస్తున్నారు. కంటెంట్ లేకపోవడంతో రెండవ రోజు నుంచి వసూళ్లు రావడం లేదు అంటూ కొందరు బయ్యర్లు అభిప్రాయపడ్డారు. వర్మ చిత్రాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి కానీ కంటెంట్ లోపిస్తోందనే విమర్శ ఎక్కువవుతోంది.