సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఏపీలో ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న సంఘటనల ఆధారంగా 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. కోలీవుడ్ నటుడు అజ్మల్ ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు.

అలానే అలీ, బ్రహ్మానందం వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో డిబేట్లు జరిగాయి. తాజాగా సినిమాలో ఓ పాటను రిలీజ్ చేశాడు వర్మ. కేఏపాల్ కి సంబంధించిన ఈ పాటను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

ఆ వీడియో షేర్ చేస్తూ.. 'ఇండియాలో జోకర్‌ సినిమా అంతే పెద్ద సక్సెస్ అయిందంటే..కేఏ పాల్ జీవితచరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తీస్తే అది బాహుబలి-3 కంటే భారీ విజయం సాధిస్తుంది. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం వాషింగ్టన్‌లో కేఏ పాల్‌తో ఈ సినిమా విషయమై చర్చలు జరుపుతున్నట్టు విన్నాను. ఈ విషయం కేఏ పాల్ స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు' అంటూ రాజమౌళి ట్యాగ్ చేశారు. అది చూసిన రాజమౌళి.. 'నన్ను ఇన్వాల్వ్ చేయకండి ‘రాజు’గారూ' అంటూ కామెంట్ చేశాడు.

దీనికి వర్మ.. 'నేను ఇన్వాల్వ్ చేయడం కాదు సర్. ట్రంప్ టవర్‌లో మీరు, కేఏ పాల్ కలిసి లంచ్ చేశారని, బాహుబలి-3 కోసం అతనితో 'సంతకం పెట్టించుకున్నారని కేఏ పాల్ నాకు చెప్పాడు. కావాలంటే కేఏ పాల్ మీద ఒట్టు' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి 'RRR' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.