కరోనా భయంతో ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న నేపథ్యంలో వారిలో ధైర్యం నిపేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్లు తమవంతుగా ప్రజలలో ఎవేర్నెస్‌ కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అందరూ స్టార్లు తమ ఇళ్లలోనే ఉంటూ ఓ షార్ట్‌ ఫిలింలో నటించారు. బాలీవుడ్  మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌ లాల్, మమ్ముట్టి, శివ రాజ్‌ కుమార్‌లతో పాటు రణబీర్‌ కపూర్‌, అలియా భట్, ప్రియాంక చోప్రాలపై చిత్రీకరించిన ఈ షార్ట్‌ ఫిలింకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు దర్శకుడు ప్రసూన్ పాండే.

ఈ షార్ట్ ఫిలిం చిత్రీకరణలో భాగంగా అమితాబ్‌ వర్షన్‌ను అభిషేక్ బచ్చన్‌ చిత్రీకరించారు. రజనీకాంత్ వర్షన్ ను ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్ చిత్రీకరించగా ప్రియాంక చోప్రా భాగాన్ని ఆమె భర్త నిక్‌ జోనాస్‌ చిత్రీకరించాడు. ఇక ఒకే ఇంట్లో ఉంటున్న రణబీర్‌, అలియాలు ఒకరి భాగాన్ని మరొకరు చిత్రీకరించారని తెలిపాడు దర్శకుడు ప్రసూన్ పాండే.

అయితే ప్రసూన్‌ ముందుగా ఈ షార్ట్ ఫిలిం ను బాలీవుడ్‌ నటీనటులతోనే చిత్రీకరించాలని భావించాడట. కానీ రణబీర్‌ అలియాలు అన్ని భాషలకు సంబంధించిన టాప్‌ స్టార్లు నటిస్తే ఈ షార్ట్‌ ఫిలిం మరింత మందికి రీచ్‌ అవుతుందని సూచించటంతో దర్శకుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ టాప్‌ హీరోలను కూడా సంప్రదించాడు. చిత్రీకరణలో భాగంగా ముందు ఓ సాంపుల్‌ను చిత్రీకరించిన దర్శకుడు అందరు నటులకు ఆ వర్షన్‌ ను పంపించి అలాగే షూట్ చేసిన వీడియోలు తనకు పంపాలని కోరాడు. అందరు హీరోలు అలాగే వీడియో పంపిన తరువాత దాన్ని ఎడిట్ చేసి రిలీజ్ చేశాడు ప్రసూన్‌.