భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. అప్పటి వరకు భారీ బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించాలంటే ఇండియాలో కేవలం శంకర్ కు మాత్రమే సాధ్యం అయ్యేది. కానీ రాజమౌళి బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకువెళ్లారు. 

రాజమౌళి తీసే సినిమాలు కమర్షియల్ హంగులతో కూడినవే, సందేశాత్మక చిత్రాలు కావు.. కానీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలిగించడంలో రాజమౌళి స్టయిలే వేరు. రాజమౌళిపై కూడా కాపీ విమర్శలు ఉన్నాయి. కానీ రాజమౌళి ఎప్పుడూ అలాంటి విమర్శల్ని పట్టించుకోరు. 

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పారసైట్ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కొరియన్ చిత్రం విమర్శల ప్రశంసలు దక్కించుకోవడమే కాక అత్యధిక ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రపంచం మొత్తం ఈ చిత్ర టీం ని ప్రశంసించారు. 

కానీ రాజమౌళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. తనకు పారసైట్ చిత్రం బోర్ కొట్టిందని, సగంలో నిద్ర పోయానని అన్నారు. రాజమౌళి కామెంట్స్ ట్రోలింగ్ కు కారణం అయ్యాయి. పలువురు నెటిజన్లు రాజమౌలిని ట్రోల్ చేశారు. ఇదిలా ఉండగా ఓ వర్తమాన డైరెక్టర్ రాజమౌళిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బహిరంగ లేక విడుదల చేశాడు. 

ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. మిఠాయి అనే చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ కుమార్. పారసైట్ చిత్రాన్ని అవమానించేలా రాజమౌళి కామెంట్స్ చేయడం సిగ్గు చేటు అని అన్నారు. పారసైట్ ఒరిజినాలిటీ కలిగిన అద్భుతమైన క్రియేటివ్ వర్క్. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఆ చిత్రం భాషల అడ్డుగోడలు తొలగించింది. 

కానీ బాహుబలి గురించి ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం మేకర్స్ మాట్లాడినట్లు నేనెక్కడా చూడలేదు. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే.. మీ సై చిత్రంలో ఒక సన్నివేశం మొత్తం కాపీ చేశారు. మరికొన్ని చిత్రాల్లో కూడా సన్నివేశాలు కాపీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీరు అద్భుతమైన పారసైట్ చిత్రం గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం తగదు అంటూ రాజమౌళిపై ప్రశాంత్ కుమార్ విమర్శల వర్షం కురిపించారు.