తను పెట్టిన పోస్ట్ పై వెంటనే స్పందించి.. సమస్యను పరిష్కరించినందుకు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసులకు ధన్యవాదాలు చెప్పారు.

తాను నివాసం ఉండే జూబ్లీ ఎన్క్లేవ్ రెసిడెన్సీ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలతో భవన నిర్మాణాలు చేపడుతున్నారని.. దాని వలన ఇబ్బందిగా ఉంటుందని తెలియజేస్తూ ఆదివారం రాత్రి ఓ ట్వీట్ పెట్టారు.

''జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సిటీ పోలీస్.. జనావాస ప్రాంతాల్లో అర్ధరాత్రిపూట పెద్ద శబ్దాలతో భవన నిర్మాణాలు చేపట్టడానికి మీరు అనుమతినిచ్చారా..? న్యాయపరంగా ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆదేశాలను నేను పాటిస్తాను'' అని హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై స్పందించిన పోలీసులు.. అడ్రెస్ తెలుసుకొని పెట్రోలింగ్ సిబ్బందిని పంపించి.. భవన నిర్మాణ పనులను నిలిపివేయించారు. దీంతో హరీష్ ట్విట్టర్ వేదికగా పోలీసులకు థాంక్స్ చెప్పారు. నమ్మలేకపోతున్నా.. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయని.. జూబ్లీ ఎన్క్లేవ్ రెసిడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు అని చెప్పారు. 

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.