టాలీవుడ్ మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. మిరపకాయ్, గబ్బర్ సింగ్, డీజే, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాల విజయాలు హరీష్ శంకర్ ప్రతిభని తెలియజేస్తాయి. గబ్బర్ సింగ్ చిత్రం సాధించిన విజయంతో ఇండస్ట్రీలో హరీష్ శంకర్ పేరు మారుమోగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానుల ఆకలిని హరీష్ శంకర్ ఈ చిత్రంతో తీర్చేశాడు. 

రెండవసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసేందుకు హరీష్ శంకర్ రెడీ అవుతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ 28వ చిత్రం హరీష్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. గబ్బర్ సింగ్ సమయంలో పరిస్థితి వేరు.. ఇప్పుడున్న పరిస్థితి వేరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినీ నటుడు మాత్రమే కాదు.. ఒక రాజకీయ పార్టీకి అధినేత కూడా. ఇలాంటి నేపథ్యంలో హరీష్ శంకర్ పవన్ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఆసక్తి నెలకొంది. 

ఫిబ్రవరి 12న పవన్ కళ్యాణ్ కర్నూలులో ఓ ర్యాలీ చేపట్టబోతున్నారు. అత్యాచారానికి గురై మరణించిన 14 ఏళ్ల చిన్నారి సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని పవన్ ఈ ర్యాలీ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలు పెట్టారు. 

ఓ అభిమాని సుగాలి ప్రీతి కేసు విషయంలో స్పందించి, ట్వీట్ చేయాలని హరీష్ శంకర్ ని కోరాడు. ఈ కేసు విషయంలో స్పందించినంత మాత్రాన అది ఒక రాజకీయ పార్టీకి, నాయకుడికో మద్దతు తెలిపినట్లు కాదని.. న్యాయం కోసం మాత్రమే స్పందించినట్లు అవుతుందని ఆ అభిమాని తెలిపాడు. 

దీనికి హరీష్ శంకర్ బదులిస్తూ.. తప్పకుండా స్పందిస్తా.. ప్రస్తుతం నేను ఈ కేసు వివరాలు తెలుసుకుంటున్నా అని రిప్లై ఇచ్చాడు. 

పింక్ రీమేక్ చిత్రంతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శత్వంలో పవన్ మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత హరీష్ దర్శత్వంలోని మూవీ పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం హరీష్ పవన్ కు సరిపడే పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.