స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించారు. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన అల వైకుంఠపురములో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక నేడు దిల్ రాజు నిర్మించిన 96 రీమేక్ జాను చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు.. నైజాం, వైజాగ్ లాంటి ప్రాంతాలపై మంచి పట్టు ఉన్న డిస్ట్రిబ్యూటర్ కూడా. ప్రస్తుతం దిల్ రాజు పలు చిత్రాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఓ కన్నేసి ఉంచాడు. 

నైజాం ఏరియాలో ఆర్ఆర్ఆర్ పంపిణీ హక్కులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జులైలో విడుదల కావలసిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని షూటింగ్ ఆలస్యం కారణంగా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది. కానీ రాజమౌళి, రాంచరణ్, రామారావు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో బయ్యర్లలో తీవ్రమైన పోటీ నెలకొంది. 

దీనితో నైజాం హక్కులు సొంతం చేసుకునేందుకు దిల్ రాజు తన ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. తాజా సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ చిత్ర నైజాం హక్కుల కోసం దిల్ రాజు రూ.75 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయట. 

రాజమౌళి తెరక్కించిన విజువల్ వండర్ బాహుబలి 2 చిత్రం నైజాం ఏరియాలో 66 కోట్ల షేర్ సాధించింది. ఇది ఆల్ టైం రికార్డ్. ప్రస్తుతం దిల్ రాజు అంతకు మించి 75 కోట్లు ఆఫర్ చేయడం ఆసక్తిగా మారింది. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకునే దిల్ రాజు అంత మొత్తం ఆఫర్ చేసినట్లు వినికిడి. 

PSPK27: ఉన్నోళ్లని కొట్టిండు.. లేనోళ్లకి పెట్టిండు!

స్వాతంత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. అలియాభట్, ఒలీవియా మోరిస్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 2021 జనవరి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.