సాధారణంగా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చే సినిమా అంటే ప్రేక్షకులలో ఓ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకు అండ. వారి అభిరుచికి తగ్గట్లే ఫ్యామిలీ ఎమోషన్స్ రంగరిస్తూ సినిమాలు చేసి బొమ్మరిల్లు లాంటి ఘన విజయాలు సాధించారు. అలాగే ఆయన బ్యానర్ కు మరో విశిష్టత ఉంది. ఓ ప్రక్క చిన్న సినిమాలు మరో ప్రక్క పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తూంటారు. వేటికవే రిలీజ్ చేస్తూ హిట్స్ కొడుతూంటారు. అయితే ఆయనకు చిన్న సినిమాలపై మమకారం తగ్గిందేమో అనిపిస్తోంది ఈ మధ్యకాలంలో ఆయన బ్యానర్ నుంచి రిలీజ్ అయిన సినిమాలను ఆయన పట్టించుకున్న తీరు చూస్తూంటే.

దిల్ రాజు సినిమా అంటే అది చిన్నదైనా , పెద్దదైనా మినిమం బిజినెస్ అయ్యిపోతుంది. ముఖ్యంగా ఆయన చేసే చిన్న సినిమాలు తెలుగు శాటిలైట్, హిందీ శాటిలైట్, అమెజాన్ ప్రైమ్ వంటి వాటి ద్వారా వచ్చే మొత్తాలతోనే పెట్టుబడి వెనక్కి తెచ్చేసుకుంటాయి. థియోటర్ బిజినెస్ ఆయనకు అదనం. అలా ఆయనకు రిలీజ్ కు ముందే ఆయన ప్రొడ్యూస్  చిన్న సినిమాలు లాభాల బాటలో పడిపోవటంతో ఇంట్రస్ట్ తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన తాజా చిత్రం ఇద్దరి లోకం ఒకటే...ఈ నెల 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటిదాకా ఎక్కడా కొద్దిగా కూడా బజ్ వినిపించటం లేదు. ఏదో తప్పదన్నట్లు పాటలు, జూక్ భాక్స్ వంటివి రిలీజ్ చేస్తున్నారు. అప్పడప్పుడు ప్రెస్ నోట్ ఇస్తున్నారు. అంతేతప్ప సినిమాని లేపి, నిలబెట్టే స్దాయిలో పబ్లిసిటీ చేయటం లేదు. ఇప్పటిదాకా చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం తెలియదంటే ఆశ్చర్యమే.

ఓ ప్రక్క ఇన్ సైడ్ రిపోర్ట్ ప్రకారం సినిమా మంచి ఫీల్ గుడ్ తో సాగుతుందని, చాలా బాగా వచ్చిందని వినిపిస్తోంది. అదేమీ దిల్ రాజు పాజిటివ్ గా తీసుకుని ప్రమోట్ చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. చిన్న సినిమాకు సోషల్ మీడియాలో మినిమం బజ్ క్రియేట్ కాకపోతే ఓపినింగ్స్ ఉండవు. ఈ బిజీ రోజుల్లో ఓపినింగ్స్ లేని సినిమాని పట్టించుకునే వారు లేరు.  అదే పరిస్దితి ఇద్దరిలోకం ఒకటే కు కనిపిస్తుందా అనిపిస్తోంది.  చూస్తూంటే ఈ సినిమాపై దిల్ రాజుకు పెద్ద ఇంట్రస్ట్ లేదనిపిస్తోంది.  మరో ప్రక్క హీరో రాజ్ తరుణ్ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా నాలుగు ముక్కలు కూడా మాట్లాడటం లేదు. ఇప్పటికీ ట్రైలర్ బయిటకు రాలేదు. టీజర్ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊసే లేదు. ఈ చిత్రం హీరోయిన్ షాలినీ పాండే  ఈ సినిమా గురించి తమ సోషల్ మీడియా ఎక్కౌంట్ లో మాట్లాడినా ఫలితం ఉంటుంది. అదీ జరగటం లేదు. ఎందుకో ఈ సినిమా పూర్తిగా నిర్లక్ష్యం  చేసినట్లు కనిపిస్తోంది.

రాజ్ తరుణ్-శాలిని పాండే జంటగా, జీ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’.  విభిన్న  ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మిక్కి జే మేయర్ సంగీతంలో వచ్చిన ఈ సినిమా పాటలు సూపర్ హిట్ కాగా, తాజాగా విడుదలైన పోస్టర్స్  ఈ సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెంచుతున్నాయి.  తక్కువ టైం లో అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ తోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారని వినికిడి.