సంక్రాంతికి బరిలో స్టార్ హీరోల సినిమాలెప్పుడూ  ఇంట్రస్టింగే. ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఆ పండగ సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. వీళ్లందరికన్నా ఫ్యాన్స్ తమ హీరో సినిమా కోసం ఒకింత ఎక్కువ ఆసక్తి చూపిస్తూ రచ్చ చేస్తూంటారు.  ఈ విషయాన్ని గమనించి పెద్ద సినిమాలు ఒకే రోజు థియేటర్లకు రాకుండా పక్కన పెడుతూ వస్తున్నారు.

గత ఎక్సపీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని -ఈతరం హీరోలు అనవసరమైన ఇగోలకు పోకుండా అడ్జెస్ట్‌మెంట్‌కు ముందుకొస్తున్నారు. కానీ, ఈ సంక్రాంతికి మాత్రం బరిలో ఉన్న పెద్ద చిత్రాలు రెండూ ఒకేరోజు థియేటర్లకు  వచ్చే అవకాసం కనపడుతోంది. జనవరి 10నే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు సినిమాలకు బిజినెస్ పరంగా లింక్ ఉన్న దిల్ రాజు డైలమోలో పడినట్లు సమాచారం.

నిర్మాతగానే కాకుండా ప్రముఖ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు... అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రెండు చిత్రాలను నైజాంలో పంపిణీ చేయబోతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటే...ఖచ్చితంగా థియోటర్స్ సమస్య వస్తుంది. మాకు సరైన థియోటర్స్ ఇవ్వలేదంటే..మాకు ఇవ్వలేదని ఇద్దరి నుంచి తలనొప్పి ప్రారంభమవుతుంది. ఇది గమనించిన దిల్ రాజు...అల వైకుంఠపురములో రిలీజ్ ని వదులుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగిదే గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగి ...నైజాం రైట్స్ తీసుకుని రిలీజ్ చేస్తుంది.

రిలీజ్ డేట్ ని అల వైకుంఠపురములో నిర్మాతలు ఖరారు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని దిల్ రాజు ఆగినట్లు తెలుస్తోంది.   ఇక జనవరి 11న మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే మొదట ఈ రెండు చిత్రాలు జనవరి 12నే విడుదల అనుకున్నారు.  అలాంటి పోటీ వాతావరణం ప్రమాదకరమని, ఎవరో ఒకరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని ప్రొడ్యూసర్ గిల్డ్ చేసిన సూచనతో ఇద్దరూ ఎడ్జెస్ట్మెంట్స్ కు ఒప్పుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఒక్కరోజు ముందుగా విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది.సరిలేరు నీకెవ్వరు చిత్రం 11న విడుదలంటూ పబ్లిసిటీ చేసారు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రం 12న విడుదల కావాలి. కానీ విడుదల తేదీలు దగ్గర పడుతున్న సమయంలో  అల వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 10నే విడుదల చేసేందుకు చిత్రం టీమ్  సన్నాహాలు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయ. దీనికి ప్రతిగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని సైతం జనవరి 10నే తెచ్చేందుకు ఆ చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.