త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత స్టార్ హీరోతో చేసిన తొలి చిత్రం అతడు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో త్రివిక్రమ్ మహేష్ కోసం రాసిన డైలాగులు అద్భుతంగా పేలాయి. 

ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ఖలేజా చిత్రం వచ్చింది. ఈ మూవీ నిరాశపరిచినప్పటికీ మహేష్, త్రివిక్రమ్ మధ్య ఫ్రెండ్ షిప్ కొనసాగింది. మహేష్ అభిమానులు కూడా త్రివిక్రమ్, మహేష్ కలయికలో మరో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇలాంటి తరుణంలో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా మరో విషయం బయటపడింది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువారం రోజు తన 48వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. అభిమానులు, సినీ ప్రముఖులంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కానీ త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేసిన మహేష్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. గురువారం రోజు కమల్ హాసన్ కూడా పుట్టినరోజు జరుపుకున్నారు. 

కమల్ కోసం మాత్రం మహేష్ ప్రత్యేకంగా ట్వీట్ చేసి బర్త్ డే విషెష్ తెలిపాడు. దీనితో త్రివిక్రమ్ అభిమానుల్లో మహేష్ పట్ల అసంతృప్తి నెలకొని ఉంది. కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం వేరేలా స్పందిస్తున్నారు. ట్విట్టర్ ద్వారా మాత్రమే బర్త్ డే విషెష్ చెప్పాలా.. ఫోన్ చేసో, వ్యక్తిగతంగానో ఏదోఒక విధంగా త్రివిక్రమ్ కు విషెష్ తెలియజేసి ఉండొచ్చుగా అంటున్నారు. 

మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బర్త్ డే విషెష్ తెలియజేయలేదు. ప్రముఖుల బర్త్ డేలకు మ్యూజికల్ బర్త్ డే అంటూ దేవిశ్రీ హడావిడి చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ త్రివిక్రమ్ పుట్టినరోజున దేవిశ్రీ ఎలాంటి ట్వీట్ చేయలేదు. త్రివిక్రమ్, దేవిశ్రీ కాంబినేషన్ లో అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి. జల్సా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు. అ..ఆ చిత్రం నుంచి త్రివిక్రమ్ దేవిశ్రీతో పనిచేయడం లేదు. 

కానీ త్రివిక్రమ్, మహేష్, దేవిశ్రీ మధ్య నెలకొన్న విభేదాలు ఏంటో అభిమానులకు అంతుచిక్కడం లేదు.