ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ‘అసురన్’ సినిమా సంచలన విజయం సాధించింది. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం  ఇప్పుడు తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే.  వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తెలుగు వెర్షన్ లో వెంకటేష్ నటించనున్నారని అఫీషియల్ గా ప్రకటన ఇప్పటికే వచ్చింది. తెలుగులో ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాని డైరక్ట్ చేసేది ఎవరు అనేది మాత్రం తేలలేదు. గత కొద్ది రోజులుగా మీడియాలో భారీ ఎత్తున ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అసురన్ సినిమా పూర్తిగా గెటప్స్, ఆహార్యం, డైరక్షన్ టాలెంట్ పై ఆధారపడింది.

టీవీ యాంకర్ మరియు దర్శకుడు ఓంకార్ చేతిలో ఈ ప్రాజెక్టు పెట్టనున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సినిమాని హారర్ కామెడీలు చేసే దర్శకుడు చేతిలో పెట్టరని తేలిపోయింది. ఇంకో నలుగురు దర్శకులు దాకా ఈ రీమేక్ కోసం అనుకున్నారు. కానీ వాళ్లు తాము ఆ స్దాయిలో తెరకెక్కించలేమని చేతులు ఎత్తేసారు. దాంతో మేకింగ్ తో సినిమాని నిలబెట్టే దర్శకుడు హను రాఘవపూడి దగ్గరకు ఈ ప్రాజెక్టు వెళ్లినట్లు సమాచారం.  అయితే ఆయన కూడా ఇంకా సైన్ చేయలేదని చెప్తున్నారు. దాంతో ఇంకా సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.  డి.సురేష్‌బాబు, క‌లైపులి థాను తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వెంక‌టేశ్ స‌ర‌స‌న శ్రియా శ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్తలు విన‌ప‌డుతున్నాయి.  

ఇదిలా ఉంటే ఈ  చిత్రాన్ని చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ని సైతం చాలా బాగా మెప్పించిందని, చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం . గత కొంతకాలంగా సినిమాలు ఒప్పుకోకుండా అజ్ఞాతవాశంలో ఉండిపోయారు షారూఖ్. దాంతో ప్రస్తుతం షారుక్ రెగ్యులర్ కథల్ని కాకుండా సౌత్ నుండి వస్తున్న భిన్నమైన తరహా కథల్ని చేయాలనుకుంటున్నారు. ఈ  క్రమంలో ఆయనకు ఈ సినిమా గురించి తెలిసి స్పెషల్ షో వేయించుకుని చూసారట. తెగ నచ్చేసి దర్శకుడుతో ఓ గంట సేపు మాట్లాడి ఓకే చేసినట్లు సమాచారం. అలా తెలుగులో వెంకి, హిందీలో షారూఖ్ చేయనున్నారు. మరి కన్నడ, మళయాళ వెర్షన్ లలో ఎవరు చేస్తారో చూడాలి.