కరోనా లాక్ డౌన్‌ కారణంగా సినీ  ప్రముఖులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఖాళీ సమయంలో ఇంటి పనుల్లో మునిగిపోతున్నారు స్టార్స్. అయితే అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ కొత్త చాలెంజ్‌ను తెర మీదకు తీసుకువచ్చాడు. ఇంటి పనులు చేస్తున్న వీడియోలను తారలు తమ సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసి అభిమానులకు ఆదర్శంగా నిలవాలని కోరాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి, చిరంజీవిలతో ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, మరి కొందరు దర్శకులు, నటులు చాలెంజ్‌ను కొనసాగిస్తున్నారు.

అదే బాటలో ఇంటి పనులు చేసిన సుకుమార్, చాలెంజ్‌ను కొనసాగించాల్సిందిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను చాలెంజ్‌ చేశాడు. చాలెంజ్‌ను స్వీకరించిన దేవీ శ్రీ తను ఇంటిపనులు చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. అయితే రెగ్యులర్‌గా కాకుండా తన మేనల్లుడు తనను ఇంటి పని చేయమని చెప్పడంతో జస్ట్ స్పీడులో పనులు చేసిన దేవీ ఆ వీడియోను ఇంట్రస్టింగ్ ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తో పోస్ట్ చేశాడు. అంతేకాదు వీడియో చివర్లో తన తల్లితో కలిసి వీడియోను అసలైన మగాళ్లను తీర్చిదిద్దిన తల్లులకు అంకితం అంటూ తెలియజేశాడు,

ఇక చాలెంజ్‌ను కొనసాగించాల్సిందిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, కోలీవుడ్ హీరో కార్తీ, కన్నడ స్టార్ హీరో యష్‌, దర్శకుడు హరీష్‌ శంకర్ లతో పాటు మలయాళ సూపర స్టార్‌ మోహన్‌లాల్‌లను కోరాడు. ఇటీవల కాస్త స్పీడు తగ్గించిన దేవీ శ్రీ లాక్ డౌన్‌ తరువాత హవా చూపించేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ప్రజలకు విశేష సేవలందిస్తున్న పోలీసులు, పారిశుధ్య కార్మికుల కోసం ఓ పాటను విడుదల చేయనున్నాడు దేవీ.