తనుశ్రీ దత్తా బాలీవుడ్ లో మొదలు పెట్టిన మీటూ ఉద్యమం పెద్ద దుమారమే రేగింది. నానాపటేకర్ లాంటి నటులు, కొందరు దర్శకులు సినిమా అవకాశాలు కూడా కోల్పోయారు. అప్పటి నుంచి దాదాపుగా ప్రతి హీరోయిన్ కు మీటూ ఉద్యమానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

అవకాశాల పేరుతో చిత్ర పరిశ్రమలో నటీమణులకు వేధింపులు ఎక్కువవుతున్నాయని పలువురు హీరోయిన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రేజీ బ్యూటీ దీపికాకు కూడా మీటూ గురించి ప్రశ్న ఎదురైంది. 

మీరెప్పుడైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా లేదు అని దీపికా సమాధానం ఇచ్చింది. అదే సమయంలో దీపికా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. అందరూ మీటూ ఉద్యమానికి సంబంధించి సినీ ప్రముఖులనే ప్రశ్నిస్తున్నారు. కానీ మహిళలని వేధించిన వారిలో కొందరు క్రికెటర్లు, క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు వారిని కూడా ప్రశ్నించాలి. 

కేవలం సినీ ప్రముఖుల్ని మాత్రమే ప్రశ్నించడం ఆపండి అని దీపికా పదుకొనె కామెంట్స్ చేసింది. మీటూ ఉద్యమం నేపథ్యంలో లసిత్ మలింగ, అర్జున రణతుంగ లాంటి క్రికెటర్లు పేర్లు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. 

దీపికా పదుకొనె గత ఏడాది రణవీర్ సింగ్ ని వివాహం చేసుకుంది. షారుఖ్ సరసన ఓం శాంతి ఓం చిత్రంతో దీపికా 2007లో చిత్ర పరిశ్రమకు పరిచమైంది. కెరీర్ ఆరంభంలో కొందరు క్రికెటర్స్ తో దీపికా ఎఫైర్ సాగించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.