బాహుబలి స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. సాహో తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించాడు. ఈలోగా లాక్ డౌన్‌ ప్రకటించటంతో సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామగా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు ప్రభాస్‌.

మహానటి ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్నట్టుగా ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రభాస్‌ ఇమేజ్‌కు మార్కెట్‌కు తగ్గట్టుగా భారీగా తెరకెక్కనుందని ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే దీపికకు కథకు కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో నటించేందుకు దీపిక ఏకంగా 20 కోట్ల పారితోషికం అడిగిందట. సాధారణంగా ఒక్కో సినిమాకు దీపిక పది నుంచి 15 కోట్ల పారితోషికం అందుకుంటుంది. కానీ ఓ రీజినల్‌ సినిమా టీం తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ప్రభాస్ సినిమాలో నటించేందుకు ఏకంగా 20 కోట్ల పారితోషికం అడిగిందట దీపిక. దీంతో షాక్‌ అయిన చిత్రయూనిట్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారట.