మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 152వ చిత్రాన్ని రంగం సిద్ధం అవుతోంది. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు దర్శకుడు కొరటాల శివ ప్రీప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

కాగా ఈ చిత్రంలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక విభాగానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క్రేజీ హీరోయిన్ త్రిష ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించబోతున్నట్లు సమాచారం. త్రిష, చిరు స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా ఇప్పటివరకు ఆసక్తికర ప్రచారం సాగింది. 

చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలకు మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. చిరు 152వ చిత్రానికి కొరటాల శివ మణిశర్మని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. ప్రస్తుతం కొరటాల శివ, మణిశర్మ చిరు 152 మూవీ కోసం గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నారు. 

కొరటాల శివ, మణిశర్మ గోవాలో ఉన్న ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో మణిశర్మ చిరు 152కి సంగీత దర్శకుడుని అని అధికారికంగా ఖరారైంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. చివరగా మణిశర్మ సంగీతం అందించిన చిరంజీవి చిత్రం స్టాలిన్. యాధృచ్చికమో ఏమో కానీ త్రిష, చిరంజీవి నటించిన ఏకైక చిత్రం కూడా అదే. 

ఇన్నేళ్ల తర్వాత మణిశర్మ మెగాస్టార్ తో చేతులు కలపడంతో అభిమానుల్లో పాజిటివ్ బజ్ మొదలయింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాసు మరణమే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

చిరు, మణిశర్మ కాంబినేషన్ బావగారు బాగున్నారా చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, చూడాలని ఉంది., మృగరాజు, జైచిరంజీవి లాంటి చిత్రాలు వచ్చాయి. ఇటీవల మణిశర్మ జోరు కాస్త తగ్గింది. ఈ ఏడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మణిశర్మ తిరిగి పుంజుకున్నాడు.