డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ కు ఆ స్థానం అంత ఈజీగా రాలేదు. ఎన్నో ఏళ్ల పాటు ఇండస్ట్రీలో దర్శకత్వ శాఖలో పనిచేసిన పూరి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనూ సూపర్‌ హిట్ అందుకొని దర్శకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అంతేకాదు అప్పటి వరకు మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా హీరోయిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు కూడా పూరినే. ఒక్కో సినిమాతో తన ఇమేజ్‌ను మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్న పూరి గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.

సినిమా కెరీరే కాదు, పూరి పర్సనల్‌ లైఫ్ కూడా సినిమాటిక్‌గానే ఉంటుంది. పూరి తన భార్య లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న విషయం అందరికీ తెలసిందే. అయితే పూరి ప్రేమకథే ఆయన సూపర్‌ హిట్ సినిమాకు ఇన్సిపిరేషన్‌ ఏమో అనిపిస్తుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పూరి, కొంత కాలం దూరదర్శన్‌ సీరియల్స్‌కు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే సమయంలో షూటింగ్‌ కోసం రామాంతపూర్ వెళ్లాడు. అక్కడే లావణ్యను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు.

తాను ప్రేమించిన విషయం డైరెక్ట్‌గా చెప్పే అవకాశం రాకపోవటంతో `తన విజిటింగ్ కార్డ్‌ అక్కడే ఉన్న ఓ అమ్మాయికి ఇచ్చి.. లావణ్య అంటే నాకు ఇష్టం. తనకు కూడా ఇష్టమైతే నాకు కాల్ చేయమని` చెప్పాడట. అయితే లావణ్య మాత్రం ముందు పూరి ప్రపోజల్‌కు అంగీకరించకపోయినా.. పూరి పదే పదే ప్రయత్నించి ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. అయితే వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవటంతో వారిని ఎదిరించి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ హీరోయిక్‌ ప్రేమ కథే పూరి తెరకెక్కించిన ఇడియట్ సినిమాకు ఇన్సిపిరేషన్‌ అని తెలుస్తోంది.