హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఆస్తి వివాదం మళ్లీ తెర మీదికి వచ్చింది. సోదరుడైన హీరో అరుణ్ కుమార్ మీద ప్రభు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24వ తేదీన అరుణ్ కుమార్ గేటు దూకి అక్రమంగా తన ఇంట్లోకి ప్రవేశించాడని, తమపై దౌర్జన్యం చేశాడని ఆయన ఫిర్యాదు చేశారు. 

అరుణ్ కుమార్ గేటు దూకి లోనికి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యాయి. మోహన్ బాబు, సి. కల్యాణ్, మురళీ మోహన్ ఈ ఘటనపై స్పందించాలని ప్రభు కోరారు. అరుణ్ కుమార్ ఈ నెల 24వ తేదీన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య మీద కూడా చేయి చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. 

ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా పై అంతస్తుకు వెళ్లి బీరువా తెరవడానికి ప్రయత్నించాడని, అందులో విలువైన వస్తువులున్నాయని ప్రభు చెప్పారు. తన అత్తామామల మీద కూడా అరుణ్ కుమార్ చేయి చేసుకున్నాడని ఆయన అన్నారు. పోలీసుల ముందే తనపై దాడి చేశాడని ఆయన ఆరోపించారు. 

చట్టప్రకారమే తాను ఈ ఇంట్లో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. దాసరి నారాయణ రావును ఇల్లును తన కూతురు పేరు మీద రాసిచ్చాడని ఆయన చెప్పారు. దాసరి నారాయణ రావు తన మనవరాలికి రాసిచ్చిన వీలునామా ప్రకారమే ఇంట్లో తాము ఉంటున్నామని ఆయన చెప్పారు.  ఈ ఇంటి విషయంలో తాము కోర్టు కేసు గెలిచినట్లు ఆయన తెలిపారు.