బుల్లితెరపై నెంబర్ 1 రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఈ షోకి ప్రేక్షకాదర దక్కింది. ఇప్పటికే తమిళ బిగ్ బాస్ షో పూర్తి కాగా.. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 నడుస్తోంది. ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ 13 మొదలైన సంగతి తెలిసిందే.

రేషమీ దేశాయ్, సిద్ధార్థ్ శుక్లా, షెనాజ్‌ గిల్‌, పారస్‌ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ, కోయినా మిత్రా, దల్జీత్‌ కౌర్‌, సిద్దార్థ్‌ డే, ఆర్తీ సింగ్‌, ఆసిమ్‌ రియాజ్‌, అబూ మాలిక్‌, షఫాలీ బగ్గా, మహీరా శర్మ వంటి సినీ సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 

ఈ షో మొదలైన రెండో వారంలో ఎలిమినేషన్ జరిగింది. సీరియల్ నటి దల్జీత్ కౌర్ హౌస్ నుండి బయటకి వచ్చింది. అలా బయటకి వచ్చిన ఆమె సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ షోలో పాల్గొనడం తాను తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. హౌస్ లో నటించడం చేతకాకపోవడం వలనే తాను ఎలిమినేట్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ షో కోసం మంచి ప్రాజెక్ట్ ను వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. జీవితంలోని మరో చాప్టర్ మొదలుపెట్టాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాను కానీ అక్కడి వాతావరణం తనకు నిరాశ మిగిల్చిందని అన్నారు.

రెండు వారాల పాటు తన కొడుకుని వదిలి ఉన్నాననే విషయం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని.. వాడు గుర్తొచ్చిన ప్రతీసారి ఎంతో బాధ వచ్చేదని.. అయితే ఇంకొన్ని రోజులు కూడా హౌస్ లో ఉంటాననిపించిందని అన్నారు. కానీ ఎలిమినేట్ అయ్యానని, ఏం తప్పు చేశానో తెలియదని అన్నారు. తను చాలా ఎమోషనల్ పర్సన్ అని, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేనని, నకిలీ స్నేహాలు, ప్రేమల మధ్య ఇమదలేకపోయాయని దల్జీత్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తన కొడుకు జేడన్ కు సమయం కేటాయించే అవకాశం లభించిందని.. ఆ తరువాత కెరీర్ పై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. తన సహనటుడు షాలీన్ బానోత్ ని పెళ్లాడిన ఆమె 2015లో అతడి నుండి విడాకులు తీసుకున్నారు.