టీం ఇండియా కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఉన్న స్థానం వేరు. ఎప్పుడో 1983లో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత పెద్దగా మెరుపుల్లేవు. గంగూలీ 2000లో కెప్టెన్ గా భాద్యతలు స్వీకరించే వరకు టీమిండియా జోరు చప్పగా సాగింది. గంగూలీ పగ్గాలు చేపట్టాక జట్టు స్వరూపాన్నే మార్చేశాడు. 

యువ ఆటళ్లలో స్ఫూర్తి నింపుతూ, సీనియర్లని సమన్వయం చేసుకుంటూ మంచి ఫలితాలు రాబట్టాడు. గంగూలీ కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలవకపోయినప్పటికీ అనేక అద్భుతమైన విజయాలు నమోదయ్యాయి. దూకుడు స్వభావం కల సారథిగా గంగూలీ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఎందరో యువ ఆటగాళ్ళని ప్రతిభ గుర్తించి వారికి అవకాశం కల్పించిన ఘనత గంగూలీకే దక్కుతుంది. 

గంగూలీ కెరీర్ లో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. అలాంటి ఆటగాడి జీవిత చరిత్రని బయోపిక్ చిత్రంగా మలిస్తే మంచి విజయం సాధించడం ఖాయం. ప్రస్తుతం క్రికెటర్స్ జీవిత చరిత్రలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సౌరవ్ గంగూలీ బయోపిక్ చిత్రానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 

గంగూలీ పాత్రలో నటింపజేసేందుకు సూపర్ హీరో హృతిక్ రోషన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రంపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్  వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇక గంగూలీ యుక్తవయసులో ఉన్నప్పుడు హ్యాండ్సమ్ హీరోని తలపించేవాడు. గంగూలీ రియల్ లైఫ్ లో ప్రేమ వ్యవహారం కూడా ఉంది. 

సినీనటి నగ్మతో గంగూలీ అప్పట్లో చాలా కాలం ఎఫైర్ సాగించాడు. ఇలాంటి సన్నివేశాలన్నింటిలో నటించాలంటే హృతిక్ రోషన్ ఫర్ఫెక్ట్ ఛాయిస్ అని కరణ్ జోహార్ భావిస్తున్నారు. గంగూలీ బయోపిక్ అంటే లార్డ్స్ మైదానంలో షర్ట్స్ విప్పేసి చిందులేయడం, లవ్ ఎఫైర్ లాంటి వివాదాస్పద సంఘటనలు గుర్తుకు వస్తాయి.షర్ట్ విప్పేసిన ఘటన పెద్దగా సమస్య కాకపోవచ్చు. కానీ గంగూలీ నగ్మాతో సాగించిన ప్రేమాయణం గురించి ఈ చిత్రంలో చూపిస్తారా లేదా అనే సందేహం ఉంది. ఈ అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

హృతిక్ రోషన్ మాత్రం గంగూలీ బయోపిక్ లో నటించాల్సిందే అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎంఎస్ ధోని, సచిన్ జీవిత చరిత్రలపై బయోపిక్ చిత్రాలు తెరకెక్కాయి. ప్రస్తుతం కపిల్ దేవ్ జీవిత చరిత్రపై బయోపిక్ మూవీ తెరకెక్కుతోంది.