గత రెండేళ్లుగా మలయాళం నటుడు దిలీప్ కుమార్ ఒక కేసు విషయంలో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. సినీ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది. ఇక ఇటీవల దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ విషయం దిలీప్ కి చేదు అనుభవం ఎదురైంది. శనివారం కొచ్చి అదనపు స్పెషల్‌ సెషన్‌ కోర్టు డిశ్చార్జ్‌ పిటిషన్‌ కొట్టివేసింది.

దిలీప్ పిటిషన్‌ను తిరస్కరించాలని విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ కోర్టును కోరిన అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణను మరోసారి దిలీప్ ఎదుర్కోవాల్సి ఉంది. ట్రయల్‌ కోర్టు నిర్ణయంతో దిలీప్ హై కోర్టుకు వెళ్లే అవకాశం అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 2017 నుంచి ఈ కేసు విషయంలో దిలీప్ అనేక రకాల వాదోపవాదాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

మలయాళం స్టార్ హీరోయిన్ ని లైంగికంగా వేధించి కిడ్నాప్ చేసినట్లు 2017న ఫిబ్రవరిలో దిలీప్ పై కేసు నమోదైంది. అయితే మధ్యలో దిలీప్ బెయిల్ పై బయటకు వచ్చి కేసును తారుమారు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.  గతంలో ఈ కేసు విషయంలో బాధితురాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించి లైంగిక వేధింపులు జరిగిన సమయంలో తీసిన వీడియోను నిందితుడికి కానీ అతడి సన్నిహితులకు కానీ ఇవ్వకూడదని కోర్టుని కోరారు. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా బాధితురాలికి సానుకూలంగా స్పందించింది.

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సమయంలో తీసిన వీడియోలు నిందితుల చేతికి ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. వాటిని అడ్డం పెట్టుకొని బాధితురాలిని బెదిరించడానికి ప్రయత్నిస్తారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో దిలీప్.. తాను ఏ నటినీ కిడ్నాప్ చేయించలేదని, అదే నిజమైతే వేధింపులకు పాల్పడిన సమయంలో రికార్డయిన విజువల్స్ ఏవన్నా ఉంటే తనకు ఇవ్వాలనిమెజిస్ట్రేట్ కోర్టును కోరారు.