ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలకు కరోనా భయం పట్టుకుంది. హైదరాబాద్ లో కూడా కరోనా కేసు బయటపడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, భద్రంగా ఉండాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ కరోనా వైరస్ భయాన్ని, మాస్క్ లను తమ సినిమా ప్రచారానికి వాడుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఈ లిస్ట్ లో రవిబాబు పేరు ముందుందనే చెప్పాలి. సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ పై స్వీయ దర్శకత్వంలో రవిబాబు నిర్మిస్తోన్న చిత్రం 'క్రష్'.

జనవరి 1న ఈ సినిమా టైటిల్ లుక్ ని రిలీజ్ చేశారు. అప్పట్లో టైటిల్ పోస్టర్ బాగా పాపులర్ అయింది. యువతను టార్గెట్ చేస్తూ సినిమా తీసినట్లు తెలుస్తోంది. తాజాగా మరికొన్ని పోస్టర్లను రవిబాబు రిలీజ్ చేశారు.

ఒక పోస్టర్ లో జిమ్ లో వర్కౌట్ చేస్తోన్న అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. కానీ ఈ పోస్టర్లో వాళ్ల ముఖాలు చూపించలేదు. ముఖాలకు మాస్క్ లు వేశారు. మరో పోస్టర్ లో అమ్మాయి, అబ్బాయి ముద్దు పెట్టుకున్నట్లు ఉంది కానీ అక్కడ కూడా అమ్మాయి, అబ్బాయికి మాస్క్ లు వేశారు. రెండు పోస్టర్స్ లోనూ 'బి సేఫ్' అని రాశారు.