కరోనా వైరస్‌ ప్రభావం దేశంలోని ప్రతీ రంగం మీద కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రతీ ఒక్కరు ఈ మహమ్మారి భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ప్రభావం వినోద రంగం మీద కూడా గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటికే సినిమాల రిలీజ్‌ లు, షూటింగ్ లు, ప్రమోషన్‌ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఈ ప్రభావం టెలివిజన్ రంగం మీద కూడా కనిపిస్తోంది. చాలా వరకు టీవీ షోస్‌కు సంబంధించిన షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.

తెలుగు టెలివిజన్‌ షోస్‌ విషయంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. తాజాగా కరోనా ఎఫెక్ట్‌ జబర్థస్త్‌ షోస్ మీద కూడా పడింది. ఈ శుక్రవారం ప్రసారమైన షోలో జడ్జ్‌ గా రోజా కనిపించలేదు. ఆమె స్థానంలో శేఖర్ మాస్టర్ కనిపించాడు. అయితే రోజా స్టేహోం కార్యక్రమంలో భాగంగా ఇంటి నుంచి బయటకు రావద్దని నిర్ణయించుకోవటంతోనే ఆమె జబర్థస్త్‌ షూటింగ్‌కు హాజరు కాలేదని తెలుస్తోంది. అయితే ఆమె లేకుండా కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరించిన నిర్వాహకులు, షూటింగ్ ను పూర్తిగా నిలిపివేశారట.

కొత్త ఎపిసోడ్స్ షూటింగ్స్‌ నిలిచిపోవటంతో షో కోసం పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచారంగా తయారైంది. కార్యక్రమంలో పాల్గొనే పెద్ద ఆర్టిస్ట్‌ లు సుధీర్‌, హైపర్‌ ఆది, అనసూయ, రష్మీ, లాంటి వారికి ఆర్ధిక ఇబ్బందులు లేకపోయినా చిన్న చిన్న నటీనటులకు పూట గడవని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. షూటింగ్ నిలిపివేసిన యాజమాన్యం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.