మహేష్ బాబు రావాలని, మోదీతో మాట్లాడాలంటూ ఓ మహిళ నానా రభస చేసిన ఉదంతం వార్తల్లో నిలిచింది. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన విజయవాడలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే...విజయవాడ..రెవెన్యూ కాలనీలోని అగ్రిగోల్డ్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఓ యువతి  ఎక్కి  పెద్దపెద్దగా కేకేలు వేసింది. దీంతో చుట్టు ప్రక్కల జనం అక్కడ గుమిగూడి  ఆమెను కిందికి దింపేందుకు చేసిన ప్రయత్నాలు చేసారు. కానీ అవేమీ ఫలించకపోవడంతో స్థానికులు పోలీసు కంట్రోలు రూముకు సమాచారం అందించారు.

కాస్సేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న మహిళా మిత్ర పోలీసులు యువతిని చెట్టు దిగమని  ఆమెకు నచ్చజెప్పారు. కానీ వారి మాటలు వినించుకోని యువతి నటుడు మహేష్ బాబు రావాలని, మోదీతో మాట్లాడాలని డిమాండ్ చేసింది. అలాగే, జగన్ కూడా తన మొర ఆలకించాలంటూ కేకలు వేసింది.

చుట్టూ గుమిగూడిన జనం ఆమెను తన దగ్గరున్న సెల్ ఫోన్  వీడియోల్లో బంధిస్తుంటే చెట్ల కొమ్మలు విరిచి వారిపై పడేసింది. కాసేపటికి గందరగోళమైపోయి...ఆమె చెబుతున్నదేంటో... ఆమె డిమాండ్ ఏంటో తెలియక అక్కడున్నవారు అయోమయానికి గురయ్యారు.ఈ హంగామాకు ఎక్కడెక్కడి జనం పెద్ద ఎత్తున అక్కడికి తరలిరావడంతో మహిళ మరింతగా చెట్టు పైకి చేరుకుంది. చివరికి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని వలలు వేసి నిచ్చెన సాయంతో ఆమెను కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన పేరు అనిత అని, తనది కోల్‌కతా అని చెప్పిందా యువతి. తనను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారంటూ రకరకాలుగా మాట్లాడుతుండడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. చివరికి  ఆమె మతిస్థిమితం కోల్పోయిన మహిళగా గుర్తించారు.