బెంగళూరు: ఓ ప్రముఖ సినీ నటిపై అత్యాచారం జరిగింది. మోసానికి కూడా గురైంది. ఈ సంఘటనపై సినీ నటి నేరుగా బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 30 ఏళ్ల సినీనటిపై ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత పరారయ్యాడు. 

బాధిత సినీ నటి బెంగుళూరులోని జేజే నగర పరిధిలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో ఉంటున్నారు. ఇప్పటికే ఆమె పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు. 2018లో బసవగుడి పరిధిలోని గాంధీ బజార్ లోని మోహిత్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నట్లు చెబుకుని ఆమెకు దగ్గరయ్యాడు. 

బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు..... కొన్నాళ్ల తర్వాత ఆమెను తన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా వేసుకున్నాడు. ఆ తర్వాత గోవా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత సంస్థ ఆర్థిక చిక్కుల్లో పడిందని ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడు. 

2019 జూన్ 22వ తేదీన తన పుట్టినరోజు పార్టీకి ఆమెను ఆహ్వానించాడు. ఆ మర్నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో ఇద్దరు కూడా పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆమె ఆరోపించారు. తాను మత్తులోకి వెళ్లిపోయిన తర్వాత తనపై అఘాయిత్యం చేశాడని, దాన్ని తన మొబైల్ లో చిత్రీకరించి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించారు. 

ఆ ఫొటోలను చూపించి, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగాడని, మొత్తం రూ.20 లక్షల దాకా తన నుంచి డబ్బు తీసుకున్నాడని ఆమె చెప్పారు. ఈ కేసులో మోహిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.