హైదరాబాద్: తెలుగు సినిమా, టీవీ నటుడు సుభాష్‌చంద్రబోస్‌ అలియాస్‌ బోస్‌ మరణించారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న సుభాష్‌చంద్రబోస్‌ ఈ నెల 24వ తేదీన ప్రమాదవశాత్తు కిందపడ్డారు. దీంతో ఆయన తలలో రక్తం గడ్డకట్టింది. 

బోస్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోపోవడంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందిన బోస్ ఆదివారం కన్ను మూశారు. బోస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 
బోస్‌ సాహసపుత్రుడు సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. చిరంజీవి హీరోగా నటించిన కొదమసింహం, కృష్ణవంశీ సినిమా గులాబీ, డేంజర్, ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు, కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం, నిన్నే పెళ్లాడుతా, ఈడియట్‌, శివమణి, ప్రేమించి చూడు, ప్రేమఖైదీలాంటి చిత్రాల్లో నటించారు.  హిందీలో ‘ప్రతిబంధ్’ సినిమాలో నటించారు. టీవీ సీరియల్స్ లో కూడా ఆయన నటిస్తూ వస్తున్నారు.