Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ప్రముఖ తెలుగు సినీనటి, దర్శకురాలు విజయనిర్మల (73) కన్నుమూశారు. ఆమె వయస్సు 73 ఏళ్లు. హైదారాబాదులోని గచ్చిబౌలిలో గల కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Cine actor and director Vijaya nirmala passes away
Author
Hyderabad, First Published Jun 27, 2019, 2:46 AM IST

హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు సినీనటి, దర్శకురాలు విజయనిర్మల (73) కన్నుమూశారు. ఆమె వయస్సు 73 ఏళ్లు. హైదారాబాదులోని గచ్చిబౌలిలో గల కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె ప్రముఖ సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు.

విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో జన్మించారు.  తొలి తెలుగు మహిళా దర్శకురాలు విజయనిర్మల.2002లో గిన్నీస్‌ బుక్‌లో ఆమె పేరు చోటు సంపాదించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. 

విజయనిర్మల దర్శకత్వం వహించిన తొలి చిత్రం మీనా. ఆ సినిమా 1971లో వచ్చింది. అది మొదలు ఆమె వెనక్కి చూడలేదు. 2009 వరకు 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆమె సినిమాలు తీశారు. ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా దక్కింది. 

దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలు ఆమె దర్శకత్వంలో తెరకెక్కాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ హీరోగా  2009లో తీసిన నేరము-శిక్ష చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం. 

విజయ నిర్మల అసలు పేరు నిర్మల. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా విజయ నిర్మలగా పేరు పెట్టుకున్నారు. నటుడు నరేశ్‌కు విజయనిర్మల తల్లి.  ప్రముఖ సినీనటి జయసుధకు ఈమె పిన్ని. 

విజయనిర్మల 1950లో ఓ తమిళ చిత్రం ద్వారా తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పదకొండేళ్ల వయస్సులో తెలుగు సినీపరిశ్రమలో ప్రవేశించారు. పాండురంగ మహత్మ్యంలో ఆమె బాలనటిగా చేశారు. తెలుగులో రంగులరాట్నం చిత్రం ద్వారా హిరోయిన్ గా ప్రవేశించారు. .

Follow Us:
Download App:
  • android
  • ios