తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా అందరికంటే డిఫరెంట్ గా సినిమాలు తీసే ఒక ఒక్క హీరో చియాన్ విక్రమ్. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎన్నో ప్రయోగాత్మకమైన పాత్రలతో మెప్పించిన విక్రమ్ అంటే టాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా ఇష్టమే. అయితే గత కొన్నేళ్లుగా విక్రమ్ కి సరైన సక్సెస్ దక్కడం లేదు.

అపరిచితుడు అనంతరం ఎన్నో సినిమాలు చేసిన విక్రమ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.  అయితే నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సౌత్ లో బిగెస్ట్ హిట్ అందుకోవాలని ఎవరు చేయని మరో ప్రయోగానికి సిద్దమవుతున్నాడు. ఒకే సినిమాలో 20 పాత్రలతో విక్రమ్ కనిపించబోతున్నాడట. ఆ సినిమాకు కోబ్రా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకర్షిస్తోంది.

చూస్తుంటే విక్రమ్ తన లోని నట స్వరూపాన్ని పూర్తిగా చూపించబోతున్నాడనే సందేహం కలుగుతోంది.  కథలను ఎంచుకోవడంతోనే తన టాలెంట్ ను చూపించుకునే ఈ హీరో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారు అంటే అప్పుడే ఆడియెన్స్ లో క్రేజ్ మొదలవుతుంది. ఇక కోబ్రా టైటిల్ వినగానే అంచనాలు డోస్ పెరిగింది. ‘డిమాంట్‌ కాలనీ, ఇమైక్క నొడిగళ్‌’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇక సినిమాలో విక్రమ్ ఇమేజ్ కి తగ్గట్టుగా డిఫరెంట్ పాత్రలు ఉంటాయని చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. ఓ విధంగా అపరిచితుడు రేంజ్ లో ఆకట్టుకుంటాయని కూడా చెబుతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని చెన్నైలో స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.