మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. చాలా కాలంగా చిరంజీవి కోసం కొరటాల శివ ఎదురుచూస్తున్నాడు. చిరు కోసం బౌండెడ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాడు కొరటాల. చిరు నటించిన 'సైరా' విడుదల కోసం కొరటాల ఇంతకాలం ఆగారు. ఇప్పుడు ఆ సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.

దీంతో కొరటాల తన కథతో ముందుకు ప్రొసీడ్ అవ్వబోతున్నాడు. దసరా సందర్భంగా మెగాస్టార్- కొరటాల కాంబినేషన్ లో సినిమాకి పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా తీసుకున్న ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 'భరత్ అనే నేను' సినిమాతో హిట్ అందుకున్న తరువాత కొరటాల తీయబోయే సినిమా  కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.

పైగా టాలీవుడ్ లో వరుసగా  సక్సెస్ లు అందుకుంటున్న దర్శకుడు కొరటాల శివ. అలాంటి డైరెక్టర్ తో చిరంజీవి అనగానే అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి పెరిగిపోతోంది.  రీఎంట్రీ ఇచ్చిన తరువాత చిరంజీవి కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

'ఖైదీ నెంబర్ 150'తో మంచి మెసేజ్ ఇచ్చిన చిరు.. 'సైరా' లాంటి సినిమాతో స్వాతంత్ర్య వీరుడి కథని ప్రేక్షకులకు తెలియబరిచాడు. ఇప్పుడు కొరటాలతో తీయబోయే సినిమా కూడా  సందేశాత్మకంగానే ఉంటుందని సమాచారం. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చర్చలు జరుగుతున్నాయి.