టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా మళ్లీ మోతమోగిపోతుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన స్టైల్‌లో బన్నీకి విషెస్ చెప్పాడు. ఇటీవల సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్న మెగాస్టార్.. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. బన్నీ చిన్న నాటి ఫోటోను పోస్ట్ చేసిన చిరు `డ్యాన్స్‌లో గ్రేస్‌, ఆ  వయస్సు నుంచే ఉంది. బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్‌ డే బన్నీ` అంటూ ట్వీట్ చేశాడు.

దీనికి తోడు బన్నీ తాజా చిత్రం పుష్పలో డైలాగ్‌ తరహాలో నువ్వు బాగుండాలబ్బా అంటూ ట్వీట్ చేశాడు. గత కొంత కాలంగా బన్నీ, మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. తన ట్వీట్ తో ఆ రూమర్స్‌కు కూడా చెక్‌ పెట్టాడు బన్నీ. ఇక సినిమా ల విషయానికి వస్తే, ఈ ఏడాది అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అందుకున్న అల్లు అర్జున్‌, త్వరలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను ప్రారంభించనున్నాడు.

ఈ సినిమా ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కరోనా లాక్ డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా కూడా రంగస్థలం తరహాలోనే పీరియాడిక్‌ జానర్‌లో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది.