ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి నిన్న సమావేశమయ్యారు. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర విశేషాలను జగన్‌కు మెగాస్టార్ వివరించారు. సైరా చిత్రం చూడాలని సీఎంను చిరంజీవి కోరారు. జగన్ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా చిరంజీవి భేటీ కావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపధ్యంలో మరో వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే..ఈ సారి చిరంజీవి డిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అక్టోబర్ 16వ తేదీన ఢిల్లీ వెళ్లేందుకు చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి గంటా శ్రీనివాస్ కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాను చూడమని చిరంజీవి వెంకయ్య నాయుడుని అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం కూడా చిరంజీవి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. ఆయన అపాయింట్‌మెంట్ కూడా దొరికితే మోడీని కూడా కలస్తారు.  

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన  సైరా నరసింహారెడ్డి  భాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మళయాల భాషల్లో సినిమా విడుదల అవగా.. తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కలెక్షన్స్ హోరు వినిపిస్తోంది.