కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ఇంటి పనుల్లో మునిగిపోయారు. అయితే తమ అభిమానులకు కూడా ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో తాము ఇంటిల్లో చేసే పనులను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు స్టార్స్‌. ఇటీవల ఎన్టీఆర్ ఇంటి పనులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి అగ్ర కథానాయకులు నలుగుర్ని ఇంటి పనులు చేయాల్సిందిగా చాలెంజ్‌ చేశాడు. అయితే ఈ వీడియోపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి తన వీడియోను ఈ రోజు (గురువారం) అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

`నేను రోజు చేసే పనులే...ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం` అంటూ తాను ఇళ్లు క్లీన్‌ చేస్తూ అలాగే తల్లి దోసాలు వేసి పెడుతున్న వీడియోను షేర్‌ చేశాడు. అంతేకాదు ఈ చాలెంజ్‌ను కొనసాగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్‌, సౌత్ సూపర్‌ స్టార్ రజనీకాంత్ లను చాలెంజ్‌ చేశాడు. ఈ చాలెంజ్‌ను మొదటగా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రారంభించాడు. సందీప్‌ రాజమౌళిని చాలెంజ్ చేయగా రాజమౌళి కీరవాణి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లను చాలెంజ్‌ చేశాడు. వెంటనే స్పందించిన ఎన్టీఆర్, టాలీవుడ్‌ అగ్ర కథానాయకులు నలుగురిని చాలెంజ్‌ చేశాడు.

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌ ఈ చాలెంజ్‌ను బాలీవుడ్‌ కు తీసుకెళ్లాడు. హిందీ యంగ్ హీరో రణవీర్‌ సింగ్‌ను చాలెంజ్‌ చేశాడు చరణ్‌. కరోనా సినీ రంగం మీద తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. సినిమా రిలీజ్‌లతో పాటు షూటింగ్ లు ఆగిపోవటంతో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో చెప్పలేని పరిస్థితి.