మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు 200 కోట్లకుపైగా బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా చిత్రం తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. 

భారీ అంచనాల నడుమ సైరా చిత్రం అక్టోబర్ 2న విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో సైతం రిలీజ్ చేశారు. తెలుగులో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ సైరా చిత్రం ఇతర భాషల్లో నిరాశపరిచింది. 

తమిళంలో కూడా సైరా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని తమిళ బుల్లితెరపై టెలికాస్ట్ చేశారు. థియేటర్స్ లో సినిమా నిరాశపరచడంతో టిఆర్పి రేటింగులపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆశ్చర్యకరంగా సైరా తమిళ వర్షన్ టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డ్ సృష్టించింది. 

సైరా బుల్లితెర ప్రీమియర్ కు 15.4 టీఆర్పీ నమోదు కావడం విశేషం. ఒక డబ్బింగ్ చిత్రం తమిళంలో ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించడం మామూలు విషయం కాదు. 

మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. తమన్నా కీలక పాత్రలో నటించి మెప్పించింది. అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.