టాలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ సోమవారం ఫేక్‌ న్యూస్‌ మీద యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. తన మీద వచ్చిన కొన్ని వార్తల విషయంలో మనస్థాపానికి గురైన విజయ్‌, ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వటంతో పాటు అలాంటి వార్తలను రాస్తున్న వారిపై ఫైర్‌ అయ్యాడు. ముఖ్యంగా ఇటీవల మిడిల్ క్లాస్‌ వాళ్లకు సాయం చేసేందుకు విజయ్‌ దేవరకొండ చేసిన ఓ కార్యక్రమం పై విమర్శలు వినిపించాయి. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన విజయ్‌ గాసిప్‌ వెబ్‌ సైట్స్‌ ను వ్యతిరేఖించాలంటూ పిలుపునిచ్చాడు.

ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా విజయ్‌కు అండగా నిలిచింది. మహేష్ బాబుతో పాటు దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, క్రిష్‌ లతో పాటు హీరోలు రానా, అల్లరి నరేష్‌, కార్తికేయ లాంటి వారు మద్దతు పలికారు. పలువురు హీరోయిన్లు కూడా విజయ్‌ పోరాటానికి మద్దతుగా నిలిచారు. తాజాగా విజయ్‌ కు మెగాస్టార్‌ నుంచి కూడా మద్దతు లభించటం విశేషం.

మంగళ వారం ఉదయం విజయ్‌కు మద్దతుగా చిరంజీవి ట్వీట్ చేశాడు. `డియర్ విజయ్‌ దేవరకొండ, మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను. బాధ్యత లేని రాతల వల్ల మీలా నేను, నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము మీతో ఉన్నాం. ఇలాంటి  కారణాలతో ఇతరలకు సాయం చేయాలన్న మీ ప్రయత్నాలను మానుకోకండి. పాత్రికేయ మిత్రులకు విన్నపం. మీ వ్యక్తిగత ఆలోచనలను వార్తలుగా చిత్రీకరించకండి` అంటూ ట్వీట్ చేశాడు చిరు.