ఈ మధ్యే సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నాడు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభిమానులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నాడు. మహమ్మారిపై పోరాటంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలుపుతున్నాడు. అంతేకాదు లాక్ డౌన్‌ టైంలో తాను ఎలా టైం పాస్ చేస్తున్నాడో కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు.

సోమవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు చిరు. `సాధారణంగా ఓ సినిమాలో సాంగ్ షూట్‌ చేసేప్పుడు పాట మొత్తం రిపిటెడ్‌గా వింటా. ఆ సమయంలో ఎలాంటి డిస్ట్రబెన్స్‌ లేకుండా చూసుకుంటా. అయితే ఇటీవల  ఓ పాట విషయంలో మాత్రం ఆపి ఆపి వింటూ ఎంజాయ్ చేశా కారణం..? రేపు ఉదయం 9 గంటలకు చెప్తా` అంటూ ట్వీట్ చేశాడు.

మంగళవారం ఉదయం ఆ పాట ఏంటో.. అలా ఆపి ఆపి ఎందుకు విన్నాడో అభిమానులతో షేర్ చేసుకున్నాడు చిరు. ఏడాది వయసున్న తన మనవరాలు నవిష్క (శ్రీజ, కళ్యాణ్ దేవ్‌ కూతురు) తన ముద్దు ముద్దు మాటలతో ఖైదీ నంబర్ 150 సినిమాలోని `మిమ్మీ మిమ్మిమ్మీ` అనే  పాట పెట్టమని అడగటంతో చిరు ఆ పాట పెట్టి మనవరాలు పాటను ఎంజాయ్ చేయటం చూసి మురిసిపోతున్నాడు. ఈ వీడియో షేర్‌ చేసిన చిరు `సంగీతానికి ఉన్న శక్తిని చూస్తే అమేజింగ్‌గా అనిపిస్తుంది. కేవలం ఏడాది వయసున్న చిన్నారి సంగీతాన్ని ఎలా ఎంజాయ్ చేస్తోంది. డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. పాట నాది కాబట్టి,అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే` అంటూ ట్వీట్ చేశాడు చిరు. అయితే ఈ వీడియో లాక్‌ డౌన్‌కు ముందు తీసిందని క్లారిటీ ఇచ్చాడు మెగాస్టార్‌.