ఇప్పుడు చిరంజీవి ఫుల్ హ్యాపీ మ్యాన్. ఈ వయస్సులో తన తోటి వారు ఎవరు కొట్టని, కొట్టలేని హిట్ కొట్టారు. ఆయన నటన గురించి అందరూ మాట్లాడుతున్నారు. సైరా చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. చిరంజీవి నటనకు, సినిమాను తెరకెక్కించిన విధానానికి  అన్ని చోట్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ‘సైరా’థియేటర్లలోనే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వీటిన్నటిని చూసి, తన కష్టానికి వస్తున్న ప్రతిఫలానికి ఆనందపడుతున్నారు చిరంజీవి.

అలాగే తన ఆనందాన్ని తోటి వారితో షేర్ చేసుకోవటం కోసం స్పెషల్ షోలు వేసి టాలీవుడ్ సెలబ్రెటీలను, అలాగే ఇండస్ట్రీకు సంభందం లేని ఇతర మిత్రులను, బంధువులు సైతం ఆహ్వానించి సైరా చూపిస్తున్నారు. అందుకు వేదిక ఎ ఎమ్ బి సినిమాస్ కావటం విశేషం. ఆయన అందుకోసం మల్టిఫుల్ షోలు  ఈ వీకెండ్ దాకా వేయటానికి ప్లాన్ చేసి  స్క్రీన్స్ ని బుక్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో బెస్ట్ మల్టిఫ్లెక్స్ గా ఎ ఎమ్ బి మల్టిఫ్లెక్స్ నిలవటంతో అక్కడే ఈ షోలు ప్లాన్ చేసారు. ఇక నిన్న రాత్రి నాగార్జున, అఖిల్ వచ్చి చిరుతో కలిసి ఈ షో చూసారు.

ఇక బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి సైరా ప్రభంజనం ఓ రేంజిలో  కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన చిరు.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను కొనసాగిస్తూ మూడో రోజులోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు.   కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు మెగాస్టార్. రేపటి నుంచి వీకెండ్ ప్రారంభం కానుండగా.. కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.