చిరంజీవి హీరోగా నటించిన `భోళాశంకర్` మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ కూడా ఫిక్స్ అయ్యింది.  అదే సమయంలో ఇందులో ఓ కిరికిరి కూడా ఉంది.

భోళా శంకర్ పై పెట్టిన కేసు వీగిపోయి.. ఈ రోజు శుక్రవారం ఆగష్టు 11 న ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్) పెట్టిన కేసుని నాంపల్లి కోర్టు కొట్టేసింది. దానితో భోళా విడుదలకు ఏర్పడిన సమస్యలు తొలిగిపోయాయి. కానీ ఇప్పుడు భోళా శంకర్ థియేట్రికల్ రిలీజ్ కి ప్రాబ్లెమ్ లేకపోయినా.. డిజిటల్ హక్కుల విషయంలో కోర్టు మెలిక పెట్టడంతో నిర్మాతకు ట్విస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.

 "భోళా శంకర్" సినిమా డిజిటల్ రైట్స్ ను కోర్టు పెండింగ్ లో పెట్టిందని వైజాగ్ కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్), అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ వెల్లడించారు. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు తన దగ్గర బ్యాంకు లావాదేవీ ల రూపంలో 30 కోట్లు తీసుకుని, తనకు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ను అమలుపరచకుండా తనను మోసం చేశారని డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్),హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. 

తనకు డబ్బులు చెల్లించేంతవరకు "భోళా శంకర్" సినిమా విడుదలను అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ లో నిలుపుదల చేయాలని తాము సిటీ సివిల్ కోర్టులో ఐదు ఐ.ఎ.లు వేయగా నాలుగింటిని డిస్మిస్ చేశారని, "భోళా శంకర్" డిజిటల్ రైట్స్ ఐ.ఎ. నెంబర్ 304ను మాత్రం పెండింగ్ లో పెట్టడం జరిగిందని వారు వివరించారు. శుక్రవారం సాయంత్రానికి కోర్టు ఆర్డర్ కాపీ వస్తే, అందులో పూర్తి వివరాలు తెలుస్తాయని వారు చెప్పారు. మెయిన్ సూట్ కోర్టులో కొనసాగుతుందని, సెప్టెంబర్ 13వ తేదీ తదుపరి విచారణ జరుగుతుందని వారు పేర్కొన్నారు. గొరవనీయ కోర్టు తీర్పును మేము శిరసావహిస్తామని, తనకు రావలసిన డబ్బుల విషయంలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని బత్తుల సత్యనారాయణ (సతీష్) భరోసా వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డర్ కాపీ అందగానే హైకోర్టుకు వెళుతున్నట్లు వారు తెలిపారు.